Sunday, November 29, 2009

క్విట్ తెలంగాణ!!

క్విట్ తెలంగాణ

కొన్ని తిండి గింజల మీద
తినేవాని పేరు రాసి వుంటుంది
ఎందుకైనా మంచిది
అన్నింటిమీద తెలంగాణ అని రాద్దాం

కొన్ని చేతులు హామీలు మాత్రమే ఇస్తాయి
కొన్నేమో ఖడ్గధారణ కోసమే పుట్టివుంటాయి
యుగాల సాగుతర్వాత కొన్ని అరచేతులు
కళ్లం ముందు నిశ్చేష్టమవుతాయి
అంతుదొరుకని అప్పులముందు
కొన్ని రుమాళ్ళు అచేతనంగా తలవంచుకుంటాయి
కొన్ని తలలు ప్రజలకోసమే తెగిపడతాయి
కొన్నిగొంతులు ప్రజల శిరస్సుల మీద ప్రశ్నల్ని మొలిపిస్తాయి
కొన్నిమాటలు కలలో కూడా వెంటాడుతాయి
ఎందుకైనా మంచిది
తలాపున కలమూ, కాగితాన్నుంచుకో
కొన్నిసార్లు శత్రువు పక్కనే కూర్చుంటాడు
ఎంమీటి చూడు ఏ పాము బుసకొడుతుందో !
ఎందుకైనా మంచిది వేసే అడుగును సరిచూసుకో
నీ చెప్పుకిందనే తేలుండవచ్చు
కొన్ని ముఖాలెప్పుడూ నవ్వుతూనే వుంటాయి
ఎందుకైనా మంచిది
విషపుకోరలేమన్నావున్నాయేమో చూడు

కొన్ని నయనాలు నడిరాత్రుల్లు మేల్కొనే వుంటాయి
రేపటి తెలంగాణను కలగంటూ వుంటాయి
కొన్ని పంచాదులు
విడిపోవడానికే పుడతాయి
ఎందుకైనా మంచిది తెంచుకుంటేనే సుఖం
కొన్ని గొంతులు చేదుగానే వుంటయ్
కవి నాలుక విద్యుజ్జిహ్వా!

రాజ దర్బారు శిఖరం మీద
ఎప్పుడో ఒక పైడికంటె కూస్తది
ఎందుకైనా మంచిది
ఇగదిగిపోవుడే క్షేమం

అన్ని సింహాసనాలకూ
ఎపుడో ఓసారి ప్రజల ఉసురు దలుగుతది
అందరు రాజులకు
ముందుగనే సమాధులు తెగుతయ్

ఇగ ఎందుకైనా మంచిది

క్విట్ తెలంగాణ!


ఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు.

ఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు.
పచ్చల్లమ్ముకోవడానికి వచ్చినొడు పత్రికల అధిపతులైన ఏమన్లేదు.


మీ విశ్వనాథ, శ్రీ శ్రీ లకు వినమ్రంగ మొక్కుతాము…
మా ధాశరథి కాళోజీ లను దాశిపెట్టుడు తప్పు కాదా..?


మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మన్శులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనది తెలుగే కాదన్నోడు, శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.


బతుకమ్మకు అట్లతద్దె కు బందుత్వం ఎప్పటిది..!
ని అట్టు కు నా జొన్నరొట్టెకు చుట్టరికం ఎక్కడిది..?



నామాటలల్ల అక్కడక్కడ సభ్యతలేదనే ఆక్షేపణవస్తదని నాకెర్కే, కాని నాభాష, నాయాస, నాబతుకు, నా తెలంగాణ ప్రజల పట్లసభ్యతగా ప్రవర్తీంచని వాణితో నాకేం సభ్యత అనేదే నా జవాబు.
- కాళోజి నారాయణరావు


ఖండాలు దాటిన జానపద గీతం నాది.
ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన పోరాటాల వారసత్వం నాది.



చేతుల చెయ్యేసుకొని తల్లికి జై కొడదాం రండి...!
ఈ నేలను అవమానించినోని గుండెల్లో తెలంగాణ డప్పుల దరువెద్దాం రండి..!!!



జై తెలంగాణ..!
జై జై తెలంగాణ !!!