Thursday, December 3, 2009

ఆ బలవంతపు పెళ్లికి విడాకులెప్పుడు?


Source: http://www.andhraprabha.in/specialstories/article-43713


దేశంలో ఏ ప్రాంతానికి లేని తిరుగుబాటు తత్వం తెలంగాణాకుంది. నాయకత్వ విద్రోహం వల్ల ఈ గడ్డపై జరిగిన ఉద్యమం వేలసార్లు అపజయం పాలైనా ఫినిక్స్‌ పక్షి మాదిరి పునరుత్థానం చెందుతూనే ఉంది. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఉద్యమం దాకా ఈ ప్రాంతం ప్రజలు చేస్తున్న పోరాటాలు అజరామరం. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి నిరసనగా, దున్నేవానికి భూమికోసం సాగిన ఉద్యమంలో నాలుగు వేలమంది ప్రాణాలు కోల్పోతే, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో 379 మంది యువకులు ఆత్మబలిదానం చేశారు. ఇక నక్సలిజం పేరుతో ఈ నేల చెల్లించిన మూల్యం వెలకట్టలేనిది.

మన ఓటుతోనే మనపై స్వారీ చేస్తున్న పెద్దలకు తెలంగాణలో ఎగిసిపడుతున్న ఉద్యమాలను అణిచివేయాలనే తపనే తప్ప సమస్యను పరిష్కరించాలన్న శ్రద్ధకాని, ఆసక్తిగాని ఎన్నడూ కనపర్చలేదు. సమస్య దున్నేవానికి భూమైనా, ఫ్రీ జోనైనా పాలకులు అనుసరించిందీ, అనుసరించేదీ దమననీతే! కాకతీయుల నుండి అసఫ్‌జాహిల వరకు, నెహ్రూ నుండి రోశయ్య వరకు పాలకులు ఎవరైనా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు మాత్రం నేటికీ నెరవేరలేదు, స్వేచ్ఛ స్వావలంబన, సార్వభౌమాధికారం కోసం ఈ నేల ఎంత రక్తాన్ని చిందించిందో ఏవూరి పొలిమేరనడిగినా చెబుతుంది. 1947 సెప్టెంబర్‌ 17న రాజరికపు పీడ నుండి తెలంగాణ బయటపడ్డా, నవనాగరికల చీడ నొదిలించుకోవడానికి ఈ ప్రాంతం ఇంకా పెనుగులాడుతూనే ఉంది.

పెద్దల హ్రస్వ దృష్టికి తెలంగాణ బలి : నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ ప్రాంతం సివిల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పాలనలోకి వచ్చింది. 1953 సంవత్సరంలో హైదరాబాద్‌ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ బూర్గుల రామకృష్ణారావుని హైదరాబాద్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. మరోపక్క మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రం బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది. అరకొర వసతులతోను, చాలీచాలని ఆర్థిక వనరులతోను ఈతిబాధలు అనుభవిస్తున్న ఆంధ్ర రాష్ట్రం ఎలాగైనా సరే హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆక్రమించాలని తలచింది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అదే తరుణంలో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశాన్ని పరిశీలించడానికే కేంద్ర ప్రభుత్వం 1953 డిసెంబర్‌ 22న సయ్యద్‌ ఫజల్‌ అలీ, సర్దార్‌ ఫణిక్కర్‌, హెచ్‌ఎన్‌ కుంజ్రులతో రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ నియమించింది. 1955 సెప్టెంబర్‌ 30న త్రిసభ్య కమిషన్‌ అందించిన నివేదికలో తెలంగాణ ప్రాంతాన్ని 7 ఏళ్లపాటు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించి అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేకాక 1962 శాసనసభ ఎన్నికల తరువాత హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభలో మూడింట రెండింతలు సభ్యులు అంగీకరిస్తేనే తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలనే షరతునూ విధించింది.

1956 ఫిబ్రవరి 20న ఫజల్‌ అలీకమిషన్‌ సిఫార్సులకు భిన్నంగా కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఒప్పందం కుదిర్చింది. ఢిల్లీలోని హైదరాబాద్‌ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పెద్దమనుషుల కుట్ర ఫలితంగానే 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది. వీరోచితమైన పోరాటాలు ఆలంబనగా హైదరాబాద్‌ రాష్ట్రం,పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, కాంగ్రెస్‌ నాయకుల కుట్ర ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగింది.

తెలంగాణ ప్రాంతపు ఆదాయాన్ని ఆ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు పెట్టాలని, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను నిర్ణీత నిష్పత్తిలో పొందడానికి 15 సంవత్సరాల నివాస నిబంధన ఉండాలని, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని, మంత్రిమండలిలో ఆంధ్ర, తెలంగాణ వారు 3 : 2 శాతం ఉండాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా పొందపర్చేరు. ఈ ఒప్పందానికి ఎలాంటి చట్టబద్ధత కల్పించకపోవడం, ఒప్పందంలోని అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపర్చక పోవడంతో ఒప్పందంపై సంతకాల తడి ఆరకముందే ఉల్లంఘనలకు గురైంది. ఆ తర్వాత వచ్చిన అఖిల పక్ష బృందం, 5, 6, 8 సూత్రాల పథకాలదీ అదే తీరు! 610 జి.ఓ. అమలుకు నోచుకోలేదు, దూరదృష్టి లేని పెద్దల ఒప్పందాలలో రాష్ట్రం రావణ కాష్ఠం అయింది, జైఆంధ్ర, తెలంగాణ ఉద్యమాల ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చును పెట్టాయి.

ఒక అమాయకురాలు (తెలంగాణ) పెళ్లి ఒక తుంటరి పిల్లవానితో జరగనున్నది. భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసివుంటే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు ఇచ్చుకున్నట్టే రెండు ప్రాంతాలు విడిపోవచ్చని ఎంతో దార్శినికతలో 6.3.1956 న నెహ్రూ నిజామాబాద్‌లో చెప్పిన మాటల్ని నేటి కాంగ్రెస్‌ ఖాతరు చేయడంలేదు.

అన్యాయాల పుట్ట నేటి తెలంగాణ : 1956 నవంబర్‌ 1 తెలంగాణకు దుర్దినం ఈ రోజునుండే 224 సంవత్సరాలు స్వయంప్రకాశంగా, సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ప్రాంతం తిరోగమన బాట పట్టింది. సాగునీరు, తాగునీరు, పరిశ్రమ, విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి, ఒకటేమిటి రాష్ట్రం అన్ని రంగాలలో వివక్షకు గురైంది. ఆంధ్రప్రదేశ్‌లోతెలంగాణ ప్రాంతం భౌగోళికంగా 41.75 శాతం ఆవరించివుంది. అయినా 40 శాతం తెలంగాణ ప్రజలకు సెంటు భూమికూడా లేదు. జనాభాలో 40.69 శాతం తెలంగాణ ప్రజలే, కాని స్థానికులు నేటికీ ఉద్యోగాలకు అనర్హులుగానే మిగిలిపోయారు. ఈ రాష్ట్ర ఖజానాకు 50 శాతం నిధులు తెలంగాణ ప్రాంతం నుండే సమకూరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదికి ఉన్న పరీవాహక ప్రాంతంలో 68.5 శాతం, గోదావరికి వున్న పరీవాహక ప్రాంతంలో 79 శాతం తెలంగాణకనే ఉంది. వాస్తవ వినియోగానికి వచ్చేసరికి అతికొద్ది శాతం నీరు మాత్రమే తెలంగాణకు లభ్యమవుతున్నది. ఈ ప్రాంతం రైతులు చెరువులు, కుంటలు, బోరుబావులపైనా ఆధారపడవలసి వచ్చింది. రాష్ట్ర భూ విస్తీర్ణం లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 1150 టిఎంసిల నీళ్లు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరగవలసి ఉంది. కాని నేటికి తెలంగాణ ప్రాంతం 380.84 టిఎంసిల నీటికే పరిమితమైంది. సాగునీటికోసం పాలకులు తెలంగాణ ప్రాంతానికి 44.28 శాతం నిధులు ఖర్చు చేయవలసి ఉంటే కేవలం 15.46 శాతంతోనే సరిపుచ్చుతున్నారు. దీనివల్ల తెలంగాణ 52 శాతం బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగాల్లో 5 లక్షల 30 వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత వాసులకు దక్కవలసి ఉంది. కాని అవి 2.5 లక్షలకు మించినవేనన్నది కఠోరసత్యం.

ఇకతెలంగాణ పరిశ్రమలకు పుట్టినిల్లు, ఈ ప్రాంతం భౌగోళిక పరిస్థితి పరిశ్రమల నిర్మాణానికి, అభివృద్ధికి అనువుగా ఉన్నాయి. ఈకారణాలలోనే నిజాం కాలంలోనే పలు పరిశ్రమలు స్థాపించబడ్డాయి, మన వలస పాలకులు వాటిని కూడా మనకు దక్కకుండా చేశారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన అజంజాహి మిల్స్‌, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ, దక్కన్‌ గ్లాసు ఫ్యాక్టరీ, డిబిఆర్‌ మిల్స్‌, అంతర్గాం స్పిన్నింగ్‌ మిల్స్‌, సిర్పూర్‌ సర్‌సిల్క్స్‌లు అమ్మేశారు. ఆల్విన్‌ వాచ్‌ డివిజన్‌, ఎపి స్కూటర్స్‌, ఆర్‌ఎఫ్‌సి లాంటి వాటిని మూసివేశారు. ఇక సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలు జీవచ్ఛవాలుగా మిగిలి ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధనకు దళితులే కీలకం : 53 సంవత్సరాలుగా విద్రోహం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా తెలంగాణ మేధావులు చేసిన కృషి ఫలితంగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం ప్రజలకు స్పష్టంగా తెలిసింది. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలన్నీ (సిపిఎం మినహా) తెలంగాణకు అనుకూలమని ప్రకటించక తప్పలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఎండమావినే తలపిస్తోంది. కారణం సుస్పష్టమే!

రాష్ట్రంలో కేవలం తెలంగాణ కోసమే ఏర్పడ్డ రాజకీయ పార్టీలు, సంఘాలు 368 పైమాటే, వీటి మధ్య సారూప్యత వున్నా, వైరుధ్యం హద్దులు దాటింది. పెద్ద మనసుతో వీటన్నింటికి కలుపుకుని, పాలకులపై ఒత్తిడి పెంచాల్సిన ''తెరాస'' అహంభావంతో పెద్దన్న పాత్రనే పోషిస్తుంది. ఫ్రీ జోన్‌ వ్యతిరేక పోరాటంలోను తెరాస ఈ తరహాలోనే వ్యవహరిస్తుంది. తెరాస అధినేత వ్యవహారశైలితో పొసగని వేలాది కరడుగట్టిన తెలంగాణ వాదులు సైతం ఉద్యమానికి దూరమయ్యారు. గత దశాబ్దకాలంగా తెరాస ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఎన్నికల ప్రక్రియద్వారా తెలంగాణ సాధించలేమని తేలింది. నేడు జరుగుతున్న ఫ్రీ జోన్‌ వ్యతిరేక ఆందోళన ఆ విషయాన్నే మరోసారి బుుజువు చేస్తోంది.

తెలంగాణ ప్రాంతంలో 53 శాతం షెడ్యూల్‌ కులాలు, తెగలవారున్నారు. బిసిలు, మైనారిటీల సంఖ్య తక్కువేమికాదు. వీరిని తెలంగాణ ఉద్యమం ఇంకా ఆకర్షించలేదు. 80 శాతంగా ఉన్న ఈ వర్గాల ప్రజల ప్రత్యేక తెలంగాణ విషయంలో ''ఏ రాయి అయితేనేమి పళ్లూడకొట్టుకోవడానికి'' అనే నిరాసక్తతతో వున్నారు, తెలంగాణ వస్తే ఈ వర్గాల ప్రజలకు మేలు చేసే ఒక విజన్‌ కాని, బ్లూ ప్రింట్‌ కాని తెరాస వద్ద లేదు, ఉన్నట్టు కూడా ఏనాడూ ప్రకటించలేదు. కారా మాష్టారు యజ్ఞం కథలోని వెట్టి ఈనాటికి తెలంగాణ అంతటా వ్యాపించివుంది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ బానిసత్వం, భూసంస్కరణలు, కుల వివక్ష, పౌరహక్కులు, రైతుల, కూలీల సమస్యలు, ఉద్యోగుల కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడిన పాపాన పోలేదు. తెలంగాణ ప్రాంతంలో కీలకమైన ఈ సమస్యలపరిష్కారానికి హామీ ఇవ్వకుండా తెరాస తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాననుకోవడం దుస్సాహసమే. కన్యాశుల్కంలోని టాంగావాలాకు వాళ్ల వూరు పోలీసు కానిస్టేబుల్‌ బదలీ ఎంత ముఖ్యమో, తెలంగాణ ప్రాంతంలోని దళితులకు భూస్వామ్య విధానం రద్దు అంతే ముఖ్యం

3 comments:

  1. ప్రపంచమంతా ఏకీకరణ దిశగా సాగుతుంటే విడిపోవాలంటారు. కరటకశాస్త్రి భాషలో చెప్పాలంటే ’మూర్ఖపు గాడిద కొడుకులు’. తెలుగుజాతి ఔన్నత్యాన్ని మంటగలపడానికి, వినాశనానికి కంకణం కట్టుకున్న మూర్ఖులు.

    ReplyDelete
  2. it depends on the way you see the issues.

    if respect other persons you will not write మూర్ఖపు గాడిద కొడుకులు.

    There is no problem if telugu people are there in more than one state.

    ReplyDelete
  3. aina thu ani moham medha ummesthu... metho kalisundam ani antunte inka kalisundhamane vallani emanalo . . ? మూర్ఖపు గాడిద కొడుకులు ane word saripothundha . .?

    ReplyDelete