Saturday, December 12, 2009

వద్దంటే, ఇదేం గోల?




తాము కలిసి ఉండడానికి సిద్ధంగా లేమని తెలంగాణవారు అంటుంటే తాము కలిసి ఉంటామని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు వాదించడంలో అర్థం కనిపించడం లేదు. పైగా, సమైక్యాంధ్రప్రదేశ్ నినాదంతో ఉద్యమం చేపట్టారు. పార్టీలకు అతీతంగా ఆ ప్రాంతాల శాసనసభ్యులు రాజీనామాలు చేసి ఏ అడ్డంకులూ లేకుండా శాసనసభ ఆవరణలో వ్యవహరిస్తున్నారు. ఏ ఉద్యమానికైనా కార్యకారణ సంబంధం ఉండాలి. ఏ వాదనకైనా హేతుబద్ధత ఉండాలి. సమైక్యాంధ్రవాదులకు ఆ రెండూ లేవు. పైగా, తెలంగాణకు చెందిన ఒక సమూహం గానీ వర్గం గానీ తాము కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం లేదు. అలాంటి ఒక సమూహమో లేదా వర్గమో ఉన్నప్పుడు వారి వాదనకు కొంత బలమైనా చేకూరి ఉండేది. ఏ కారణమూ లేకుండా, హేతుబద్ధత అసలే లేకుండా తాము విడిపోవడానికి సిద్ధంగా లేమని వాదిస్తే దాన్ని ఏమనుకోవాలి. దోచుకోవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి, అణచి వేయడానికి, పాలించడానికి తమకు హక్కు ఉందని అనడమే. అంతకన్నా తమకు తెలంగాణతో కలిసి ఉండడం వల్ల స్వప్రయోజనాలున్నాయని అనుకోవాలి. స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే కలిసి ఉండాలని కోరుకుంటున్నామని అనుకోవాలి.

దశాబ్దాల మోసం, అణచివేత కింద తాము నలిగిపోయామని, తాము విడిపోతామని తెలంగాణ వారు వాదిస్తుంటే, అందుకు తగిన కారణాలు చూపుతుంటే, అందుకు తగిన ప్రాతిపదికను ముందు పెడుతుంటే సమైక్యాంధ్రవాదులు మాత్రం తాము పట్టిందే పట్టు అన్నట్లు ఏ విధమైన కారణాలు చూపకుండా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారు. కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరి చేస్తామని చెప్పడం లేదు. కనీసం, అన్యాయం, అణచివేత, విస్మరణ జరగలేదని చెప్పడానికి కూడా సిద్ధం కావడం లేదు. అంటే, వారు ఏకపక్షంగా, అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని అనుకోక తప్పదు. రాజకీయ నాయకులు హైదరాబాదులో ఉండి చాలా హాయిగా తమ తమ ప్రాంతాల ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి ఆట సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో జరుగుతున్న విధ్వంసం గురించి, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం గురించి, విద్యార్థుల చదువుల గురించి వారు మాట్లాడడం లేదు. మీడియా కూడా అక్కడి విధ్వంసం గురించి ఏమీ ఎత్తడం లేదు. తెలంగాణలో జరుగుతున్న సంఘటనలను భూతద్దంలో చూపెట్టారు. రాష్ట్ర పోలీసు బలగాలు సరిపోవన్నంటూ, తెలంగాణేతర బలగాలను, కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఒక రకమైన భాయనక వాతావరణాన్ని కల్పించారు. తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచిస్తే కూడా ముఖ్యమంత్రి కె.రోశయ్య చర్యలు తీసుకోలేదు. పైగా, చాలా సున్నితంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయని సన్నాయి నొక్కులు నొక్కారు. తెలంగాణలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన కొద్దిపాటి విధ్వంస కాండపై గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణేత ప్రాంతాల్లో జరుగుతున్న విధ్వంసకాండపై, ఆర్టీసి బస్సులపై జరుగుతున్న దాదడుల గురించి, దుకాణాలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడడం లేదు.

పార్టీలకు అతీతంగా తమ తమ పార్టీల శాసనసభ్యులు రాజీనామాలు చేయడాన్ని కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఆ మూడు పార్టీలు కూడా కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల చేతుల్లోనే ఉండడం కారణం కాదా. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను నామమాత్రం చేసి వైయస్ జగన్ నాయకుడిగా చెలామణి కావడం కాదా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి మావోయిస్టులు ప్రవేశించారంటూ ప్రచారం చేసిన ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు ఉత్తరాంధ్రలోని నక్సలైట్ల ప్రాబల్యం గురించి ఎందుకు మాట్లాడడం లేదు. అక్కడ కూడా నక్సలైట్ ప్రాబల్యం ఉంది కదా. ఆ ఉద్యమంలోకి కూడా మావోయిస్టులు ప్రవేశించి ఉండవచ్చు కదా. ప్రశాంతంగా జరపాలని మాత్రమే సున్నితంగా చెప్పి మీరు కానీయండన్నట్లు నాయకులు వ్యవహరించడాన్ని ఏ నీతి అనుకోవాలి.

పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు రాజీనామాలు చేయడం పార్టీ నిర్ణయాలను ధిక్కరించడం కాదా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన ఆ పార్టీల నాయకులు వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు. అంటే వారి పక్షపాత వైఖరిని బయట పెట్టుకున్నట్లే కదా. రాజకీయ సంక్షోభం సృష్టించి, బ్లాక్ మెయిల్ చేసి తమ ఆధిపత్యాన్ని, మోసాన్ని, దగాను నిరంతరం కొనసాగించడానికి వేస్తున్న ఎత్తులే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నాయని అనుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుల రాజీనామాలను ఏ విధంగానైతే స్పీకర్ ఆమోదించారో అలాగే ప్రస్తుత శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది. అణచివేతకు, అన్యాయానికి, వివక్షకు గురవుతున్న సెక్షన్లు రాజకీయ సంక్షోభాన్నే కోరుకుంటాయి. సంక్షోభం ఆధిపత్య వర్గాలకు, పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఉండకూడదు. అందువల్ల శాసనసభ్యుల రాజీనామాల ఆమోదాన్నే తెలంగాణవాదులు కోరుకుంటున్నారు.

మన కన్నా తక్కువ జనాభా ఉన్న అమెరికాలో 50 రాష్టాలున్నాయి. మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే 29 రాష్ట్రాలవుతాయి. అందులో తప్పేముంది. మరిన్ని రాష్టాలు వస్తే నష్టమేమిటి, ఎవరికి నష్టం అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆదర్శం కాదని ముఖ్యమంత్రి రోశయ్య హితబోధ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేసిన తర్వాత మరిన్ని రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని, మనం ఆదర్శంగా నిలబడాలని, ఇది ఆదర్సం కాదని ఆయన అంటున్నారు. అంటే, ఆయన మనసులో మాటను ఏ విధంగా బయటపెట్టారో అర్థం చేసుకోవచ్చు. బుందేల్ ఖండ్, విదర్భ లాంటి అన్ని దగా పడ్డ ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ ను తెలంగాణ ఉద్యమం బలపరుస్తున్నది. తెలంగాణ ఉద్యమం వెనక ప్రాపంచిక దృక్పథం, ప్రజా మేలు కోరే మేధావులున్నారనే విషయాన్ని సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకులు, కుహనా మేధావులు గుర్తించాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటును కూడా తెలంగాణ ఉద్యమం ఆశిస్తుంది. మద్రాసు నుంచి వేరు పడిన తర్వాత రాయలసీమ ప్రాంత ప్రజలు కోస్తాంధ్ర నాయకత్వం చేతిలో ఎలా మోసానికి గురైందో, శ్రీబాగ్ ఒడంబడిక ఎలా ఉల్లంఘనకు గురైందో తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నష్టపోయేది సాధారణ ప్రజానీకమే. వారిని చీకట్లో పెట్టి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు.

Source: http://thatstelugu.oneindia.in/feature/columns/2009/no-reason-behind-the-united-andhra-111209.html

3 comments:

  1. బలవంతపు పెళ్ళి చెయ్యించేది దెబ్బలాటల సంసారం కోసమే.

    ReplyDelete
  2. బూతు బూతు...... దెబ్బలాట ఏమిటి మార్తాండ

    ReplyDelete